ఈ వారంలోనే ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు..లక్కీ డ్రాలో ఎంపికైన 6,660… మిగతా వాళ్ళ సంగతి ఇదే..

0
1000114290
Share

ఇందిరమ్మ టవర్స్‌ LIG ఇళ్ల లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు

6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి

బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దు: వి.పి. గౌతమ్

ఇందిరమ్మ టవర్స్‌ LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్‌ ఛైర్మన్ , హౌసింగ్ కమిషనర్ శ్రీ వి.పి. గౌతమ్, ఐఏఎస్ తెలిపారు.

మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు (Allotment Letters) జారీ చేస్తామని తెలిపారు.

లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన మరియు అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయిస్తామని లేదా అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

“గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులు లేదా ఇతర వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపంలో డబ్బులు చెల్లించవద్దు. గృహాల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన అర్హతలు మరియు అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది” అని గౌతమ్ స్పష్టం చేశారు.

గృహానికి సంబంధించిన మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపు గడువు మరియు ఇతర సూచనలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. కేటాయింపు పత్రంలో పేర్కొన్న అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.

ఇతర వ్యక్తులు తెలిపే ఖాతాలకు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ చేయవద్దని హెచ్చరించారు. ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా లేదా అనధికారిక ఖాతాలకు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లబ్ధిదారులు గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ tghb.telangana.gov.in⁠ను సందర్శించవచ్చు లేదా కాల్‌ సెంటర్ నంబరు 040-24603572ను సంప్రదించవచ్చు.

తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు మరియు సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని కమిషనర్ లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *