మూడు రోజులు అతి భారీ వర్షాలు
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..
19,20, 21న అతి భారీ వర్షాలు
పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ
రైతుల్లో కొత్త ఆశలు
తెలంగాణలో మరోసారి వర్షాలు ఊపందుకోనున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంపై కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ద్రోణి కర్ణాటక మీదుగా కొనసాగుతున్నట్లు తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావం దాదాపుగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలోనే మళ్లీ వర్షాలు మొదలవడం గమనార్హం. దీంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షాలు లేకపోవడంతో వాననీటిపై ఆధారపడిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బోర్లు, కాలువల నీటి సౌకర్యం ఉన్న రైతులకు కొంత మేర ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పటికీ.. కేవలం వర్షపు నీటినే నమ్ముకుని సాగు చేసిన రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
పంటలు ఎండిపోతున్న సమయంలో ఇప్పుడు కురిసే వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడి వర్షాలు కురిసి తమ పంటలను ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.
అయితే వర్షాల తీవ్రత, ఏ ప్రాంతాల్లో ఎంతమేర వర్షపాతం నమోదవుతుందన్నది రానున్న రోజుల్లోనే స్పష్టమవుతుంది.

