అనలాగ్ పన్నీర్ అంటే ఏమిటి? తెలంగాణలో బంద్ ఎందుకు..?
పన్నీర్ బటర్ మసాలా అంటే చాలామందికి నోరూరిపోతుంది.
చికెన్, మటన్ కంటే కూడా పన్నీర్‌తో చేసిన వంటకాలనే ఇష్టపడే వాళ్లు చాలామంది ఉన్నారు. హోటల్‌కు వెళ్లినా… రెస్టారెంట్‌కు వెళ్లినా… మెనూలో పన్నీర్ బటర్ మసాలా కనిపిస్తే చాలు ఆర్డర్ చేసేస్తారు.
కానీ… మనం తింటున్న ఆ పన్నీర్ నిజంగానే పాలతో తయారైందా?
అసలు ఆ పన్నీర్ ఎలా తయారవుతోంది? అందులో ఏ పదార్థాలు వాడుతున్నారు? అనే విషయాన్ని ఎంతమంది ఆలోచిస్తున్నారు?
ఇప్పుడు ఇదే ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.
తెలంగాణలో అనలాగ్, నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్ పన్నీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. సెప్టెంబర్ 10, 2026 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
అసలు ఈ అనలాగ్ పన్నీర్ అంటే ఏమిటి?
సాధారణ పన్నీర్ పాల నుంచి తయారవుతుంది. కానీ అనలాగ్ పన్నీర్‌లో పాలకు బదులుగా లేదా పాల పదార్థాలను భర్తీ చేస్తూ వెజిటబుల్ ఫ్యాట్స్, ఎడిబుల్ ఆయిల్స్, స్టార్చ్, ఇతర నాన్-డెయిరీ పదార్థాలు ఉపయోగించవచ్చు. చూడటానికి, తినడానికి అసలు పన్నీర్‌లానే కనిపించేలా తయారు చేస్తారు.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
పన్నీర్ పేరుతో నాన్-డెయిరీ ఉత్పత్తిని వినియోగదారుడికి తెలియకుండా విక్రయిస్తే… అది కేవలం ధర విషయంలో మోసం కాదు, ఆహార నాణ్యత విషయంలో కూడా తీవ్రమైన ప్రశ్న.
ఎందుకంటే పన్నీర్ అంటే ప్రొటీన్ కోసం తినే ఆహారం. కానీ అనలాగ్ పన్నీర్‌లో పోషకాల నిష్పత్తి అసలు పాల పన్నీర్‌తో ఒకేలా ఉండదు. అంతేకాదు, ఉపయోగించే పదార్థాల నాణ్యత, తయారీ విధానం, లేబులింగ్ వంటి అంశాలు కూడా కీలకం.
అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి హోటల్‌లో పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సిందే…
మన ప్లేట్‌లో ఉన్నది నిజమైన పన్నీరా?
లేక పన్నీర్‌లా కనిపించే అనలాగ్ పన్నీరా?
ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది

