మహిళా బైకర్‌ను వెంటాడి ఢీకొట్టి… అసలేం జరిగింది..?

0
1000132998
Share

Gurugram Woman Biker Case: గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఓ కారు వెంటాడి ఢీకొట్టిన ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు సియా చేసిన ఆరోపణలతో పాటు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత సియా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

అసభ్యకరమైన సైగలు చేశారంటూ ఆరోపణ

సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కొంతమంది బైకర్లతో కలిసి గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వెళ్తుండగా ఓ కారు తమను వెంబడించడం ప్రారంభించింది. కారు డ్రైవర్‌ను సురక్షిత దూరం పాటించాలని తాను సైగల ద్వారా కోరినప్పటికీ అతడు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది.

కారులో ఉన్న వ్యక్తులు కారు అద్దాలు దించి అభ్యంతరకరమైన సైగలు చేశారని సియా తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు ఆమె సోదరుడు తెలిపారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారంతా మద్యం సేవించినట్లు అనిపించిందని సియా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

బైక్‌ను ఢీకొట్టిందన్న సియా

కారు తనకు అడ్డుగా రాకుండా ఉండేందుకు తాను ముందుకు వెళ్తూనే ఉన్నానని సియా తెలిపింది. అయితే కొద్దిసేపటి తర్వాత కారు ఒక్కసారిగా తన బైక్ వైపు మళ్లి పక్క నుంచి ఢీకొట్టిందని ఆరోపించింది. దీంతో తాను బైక్‌పై నుంచి కిందపడిపోయినట్లు వెల్లడించింది.

ఈ ఘటన ఉదయం సుమారు 7:30 నుంచి 8 గంటల మధ్య జరిగినట్లు సియా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవడం అదృష్టమని కుటుంబ సభ్యులు చెప్పారు.

‘సియా ట్రామాలో ఉంది’

ఘటన తర్వాత సియా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని ఆమె సోదరుడు తెలిపారు. ఆమె ప్రస్తుతం ట్రామా వంటి పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు.

ఈ ఘటనపై కుటుంబం న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. తమ న్యాయవాది ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోతో మాట్లాడారని, కుటుంబం తరఫున కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తామని సియా సోదరుడు వెల్లడించారు.

‘ముందే తెలిసి ఉంటే నేనే ఎఫ్‌ఐఆర్ చేసేవాడిని’

ఈ ఘటన గురించి తనకు ఆలస్యంగా తెలిసిందని సియా తండ్రి తెలిపారు. విషయం ముందే తెలిసి ఉంటే తానే పోలీసులను ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవాడినని చెప్పారు.

పగటి సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. అదృష్టవశాత్తూ తన కుమార్తెకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని తెలిపారు. ఘటన జరిగిన విషయం ఇంటికి వచ్చిన వెంటనే సియా ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల చర్య

సియా ఘటనను వివరిస్తూ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. దీనిపై గురుగ్రామ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

‘ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టలేదు’.. నిందితుడి వాదన

అయితే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారు డ్రైవర్ మాత్రం మరో విధంగా స్పందించాడు. యూటర్న్ సమీపంలో కారు అదుపుతప్పడంతోనే బైక్‌ను ఢీకొట్టిందని, తాను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టలేదని అతడు చెప్పాడు.

అంతేకాదు.. ద్విచక్ర వాహనం నడుపుతున్నది మహిళ అని కూడా తనకు తెలియదని నిందితుడు పేర్కొన్నాడు.

బాధితురాలి ఆరోపణలు, నిందితుడి వాదనలు పరస్పరం భిన్నంగా ఉండటంతో.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *