ఎందుకు అవసరమో కూడా తెలియని ఆ ఫోటోల కోసం ప్రతి ఒక్కరూ లైన్ కట్టారు..!

0
1000131731
Share

by SSR

డేటా సెంటర్లు ఇక్కడ వద్దు… కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?
సోషల్ మీడియా తెరిస్తే చాలు… ఎక్కడ చూసినా పర్యావరణం కోసం తపించేవాళ్లే కనిపిస్తున్నారు.
మన దేశంలో ఎక్కడైనా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా ప్రాసెసింగ్ సెంటర్లు వస్తున్నాయంటే చాలు, వీళ్లందరికీ ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది.
“మన దేశంలో నీళ్లే లేవు, ఈ డేటా సెంటర్లు వస్తే ఉన్న నీళ్లన్నీ పాడైపోతాయి, భూగర్భ జలాలు హారతి కర్పూరం అయిపోతాయి” అంటూ తెగ ఆవేదన పడిపోతుంటారు.
కానీ, అదే పర్యావరణం కోసం తపించే మహానుభావులు సోషల్ మీడియాలో ఒక చిన్న ట్రెండ్ రాగానే ఏం చేస్తున్నారో ఒక్కసారి గమనించారా?

ఈ మధ్య కాలంలో వచ్చిన ‘1980s Retro Filter’ గుర్తుంది కదా? దేనికీ పనికిరాని, ఎందుకు అవసరమో కూడా తెలియని ఆ ఫోటోల కోసం ప్రతి ఒక్కరూ లైన్ కట్టారు. పరిశోధనల ప్రకారం, ఒక్క AI ఫోటోను ప్రాసెస్ చేయడానికి సర్వర్లకు దాదాపు 50 మిల్లీలీటర్ల (సుమారు రెండు స్పూన్ల) స్వచ్ఛమైన నీరు ఖర్చవుతుంది (ఆ సర్వర్లను చల్లబరచడానికి మరియు విద్యుత్ కోసం).
అంటే కేవలం మీ ఒక్కరి సరదా కోసం రెండు స్పూన్ల నీరు ఆవిరైపోతోంది. మరి సోషల్ మీడియాలో కోట్లాది మంది తమ ఫోటోలను మార్చుకున్నప్పుడు, కేవలం కొన్ని రోజుల్లోనే లక్షల లీటర్ల నీరు వృథా అయిపోయింది కదా!
దీని గురించి ఎప్పుడైనా,
ఒక్కరైనా నోరు విప్పారా?

ఇక్కడ అసలైన ద్వంద్వ నీతి ఏంటంటే…
“డేటా సెంటర్లు మన దేశంలో పెడితే ఇక్కడి నీళ్లు పాడైపోతాయి కాబట్టి మాకొద్దు… కానీ ఎక్కడో వేరే దేశంలో ఉన్న డేటా సెంటర్ల సౌకర్యాన్ని వాడుకుని మేము మాత్రం ఫోటోలు మార్చేసుకుంటాం!”
పర్యావరణం అంటే కేవలం మన ఊరు, మన సరిహద్దులు మాత్రమేనా?
వేరే దేశంలో నీళ్లు వృథా అయితే అది ఈ భూమి మీది నీరు కాదా?
అక్కడ పర్యావరణం దెబ్బతింటే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మన మీద పడదా? అక్కడ మాత్రం నీళ్లు అవసరం లేదా.?

పర్యావరణం కోసం తపించడం అంటే వేదికల మీద, సోషల్ మీడియా కామెంట్ల లోనే కాదు… మనం వాడే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మీద కూడా ఆ స్పృహ ఉండాలి. కంటికి కనిపించని ఈ ‘డిజిటల్ కాలుష్యం’ పై బాధ్యతగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *